కొన్నాళ్ళకి నక్షత్రాలన్నీ చల్లారిపోయి, విశ్వం చైతన్యరహితంగా తిమిరాంధకారంలో ములిగిపోతుంది. ఇందుకేనా సృష్టి జరిగింది? చీదేసిన సిసింద్రీలా కాసింతసేపు హడావిడి చేసి చివరికి ఇలా ఒక మూల తొంగుంటుందంటే ఎవరు మాత్రం సహించగలరు? ఈ జగన్నాటకానికి మరొక అంకం ఉంటే బాగుంటుంది కదా!
అక్టోబర్ 2021
ప్రసిద్ధ సాహిత్యకారుల జయంతులు వర్ధంతులూ పేరిట ఉండుండీ కొంత చప్పుడు చెయ్యడం ద్వారా, తెలుగుజాతి, భాష మీద తనకింకా ప్రేమ ఉందని చాటుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఈ చప్పుళ్ళు చేసే తెలుగుజాతి పరిధి మాత్రం చాలా చిన్నది. ఏనాడో రాసేసి చేతులు దులిపేసుకున్నవాళ్ళు, ప్రస్తుతం విరివిగా రాస్తున్నవాళ్ళు, రేపో మాపో తమ ప్రచురణలతో ముందుకు రాబోతున్నవాళ్ళు, పత్రికల, సభల నిర్వహకులు – తెలుగుసాహిత్య వర్తమాన చిత్రంలో ఎటు తిరిగినా కనపడేది ఈ నలుగురే. ఏతావాతా రచయితలే మనకు మిగిలిన పాఠకులు. వీరందరికీ ఒకరితోటి ఒకరికి అవసరం. కనుక సాహిత్యానికి సంబంధించి ఉన్నదున్నట్లు చెప్పడానికి భయం. అందుచేత వీరివల్ల సాహిత్యానికి ఒనగూడే లాభం ఏమిటన్నది అర్థం కాదు కాని, నష్టం మాత్రం ఊహించలేనిదేం కాదు. సాహిత్యాన్ని అభిరుచిగా, అలవాటుగా ఇంటింటిలోనూ కనీసం పత్రికలుగానైనా చూసే రోజులనుండి కేవలం సోషల్ మీడియా గుంపుల్లో బాతాఖానీకి పనికొచ్చే భాషగా మిగుల్చుకోవడంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆలోచనల లోతులను లైకుల సంఖ్యతోను, ప్రతిపాదనల బలాన్ని మంది షేర్లతోనూ కొలుచుకోవడం మొదలైనప్పుడే, నిజమైన పాఠకుడికోసం విభిన్నంగా శ్రద్ధగా రాయడం పట్ల కవిరచయితలకు అవసరమూ లేకపోయింది. అందుకే ప్రస్తుత సాహిత్యంలో తక్షణ స్పందనలు, హాయిగొలిపే కబుర్లూ కనపడ్డంతగా ఆలోచనతో రాసే రాతలు కనపడవు. ఆలోచన కలిగించే రాతలు అసలే అరుదు. సాహిత్యం మనకు కేవలం ఒక వానపడుతుంటే హాయికోసం పట్టుకొనే హస్తాభరణంగానో, లేదూ కాఫీ టేబుల్ మీద పెట్టుకొనే అలంకరణగానో మిగిలిపోయింది. మనకు సాహిత్యం ఇష్టం అని చెప్పుకొని భుజాలు చరుచుకోవడంపై ఉన్న శ్రద్ధ, ఆసక్తి నిజంగా సాహిత్యం పట్ల లేదు. అందుకే, ఒక సమకాలీన రచయిత రచనల మీద విశ్లేషణ కన్నా, శ్రీశ్రీ పుస్తకపు రీప్రింట్ ఫేస్బుక్ గోడల మీద ఎక్కువ హంగామా చేస్తుంది. జాషువాని కులమనో కరుణరసమనో ఒక ఇరుసులో బిగించి చప్పట్లు కొడతాం. విశ్వనాథ అయితే దైవం లేకుంటే దయ్యం, కేవలం అంతే. అడపాదడపా ఏ త్రిపురనో, మోనో, ఇంకెవరినో తలచుకున్నా అది వారి వ్యక్తిగతస్నేహాలు జ్ఞాపకాల నెమరువేత స్థాయిని దాటనివ్వం. వారిగురించి ఎప్పుడూ చెప్పే మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం. వారి వర్ధంతులూ జయంతులూ, విగ్రహాలూ పటాల ఆవిష్కరణలూ మాత్రమే మనకు ముఖ్యం. ‘తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుల’ని ఒక మాటనేసి, సదరు ఫేస్బుక్ పోస్టుల కింద నమస్కారాల ఎమోజీల దండలు వేసి ఎవరి దారిన వారు పోవడం మినహా తెలుగుసాహిత్యకారుల చేతిలో నిశితమైన సాహిత్య విమర్శ విశ్లేషణకు నోచుకున్న ఒక్క తెలుగు కవి/రచయిత కనపడరు. ఇలా సందర్భాల నెపంతో గొప్ప కవిరచయితలకు గౌరవం ఇవ్వకపోగా ద్రోహం చేస్తున్నాం. వాళ్ళ ప్రాసంగికతను చెరిపేస్తున్నాం. అవమానపరుస్తున్నాం. పాత కళ్ళద్దాలను కొత్తతరానికి బలవంతంగా అంటించి వేడుక చేస్తున్నాం. కొత్త వెలుతురులోకి పాత సాహిత్యాన్ని తీసుకెళ్ళలేనప్పుడు, ఊరికే ఉత్సవాల పేరిట అయినవాళ్ళకి వాయినాలిచ్చుకునే చందాన సాగుతున్న ఈ తంతు అనవసరపు ఆర్భాటమే. సాహిత్యసృజన, విమర్శ సమయాన్ని కోరతాయి. తెలుగువాళ్ళు తెలివైనవాళ్ళు. సమయం విలువ తెలిసినవాళ్ళు. దాన్ని సాహిత్యంలో పారేసుకోరు.
‘ఘర్షణలు ఆ ప్రాంతం పొలిమేరలు దాటలేదు’ అంటే మనుషులు నరుక్కోవడం, ఆస్తులు తగలెట్టడం లాంటివి చుట్టుపక్కల ప్రాంతాలకి పాకలేదు, అని. మరది యంత్రాంగం పనిజేయడం వల్లా లేకపోతే తంత్రాంగం ఊరుకోవడం వల్లా అన్నది తెలీదు; ఎవరికీ, ఎప్పటికీ!
ఆడవాళ్ళ నెత్తిమీద నీళ్ళకుండ ఉంటుంది, ప్రతీదానికి ఏడుస్తూనే ఉంటారు అంటారు మొగాళ్ళు. నిజఁవే. ఆడవాళ్ళకి అలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. నాకు ఏడుపు రాదు. ఆలోచన ఉన్నవాళ్ళకి ఏడుపు అంత త్వరగా రాదట! మొగవాళ్ళు అందుకే ఏడవరు. బుర్రే పని చేస్తుందట వాళ్ళకి. గుండె కాదు!
మనిషి మనసు ఒక మహాసముద్రమని, దాన్ని అర్థం చేసుకోవడం కష్టసాధ్యమనీ, మానవ హృదయంలో అతనికే తెలీని ప్రేరణలు, ఆలోచనలు ఉంటాయనీ మనస్తత్వ శాస్త్రం నిరూపించిన తర్వాత, అవేవీ తెలియకుండా ఇంత లోతైన మనస్తత్వాలను చిత్రించిన ఎమిలీ బ్రాంటీ ఒక గొప్ప రచయిత్రిగా గుర్తింపు పొందింది.
గోపాల కామత్ కొట్లో కుప్పన్న బాకీ ఏటికేడాదీ పెరుగుతూ పోయి వెయ్యి దాటేసింది. అప్పుడప్పుడు గోపాల కామత్ పంపే మనిషి కుప్పన్న ఇంటికి పోయి డబ్బు కట్టమని అడగటం అందరికీ తెలుసు. అప్పన్న భట్ట గోపాల్ కొట్లోనే కాదు, మఠం కౌలు కూడా ఏడాది చివర్లో పైసా కూడా బాకీ లేకుండా తీర్చేస్తాడు. మఠం నుంచి కౌలు వసూలుకు వచ్చే మనిషికి అప్పన్న భట్ట ఇంట్లో సకల మర్యాదలూ దక్కుతాయి కూడా.
తిరువాన్కూరు మొదట చేసిన నిశ్చయమును మార్చుకొని భారతీయ సమితిలో చేరదలచెను. హిందూప్రజలును మహమ్మదీయ పరిపాలకుడును గలిగిన నిజాము రాజ్యము మాత్రము భారతదేశ క్రొత్త అధినివేశముల రెండింటితోనూ సంధి యేర్పాటుల ద్వారా రాజ్యాంగబంధమును కలిగుయుండుటకు నిశ్చయించెను.
తులసి అక్క కాలం చేసిందని తెలిసింది. ఏ జబ్బూ లేని, ప్రాణం ఉన్న రాయిలా నిక్షేపంగా ఉండేది. అక్క అంటే దూరపు చుట్టరికమే అయినా, వయసులో అంతరం ఉన్నా మనసుకి దగ్గరే. కొడుకులిద్దరూ ఒకడు ఇంగ్లాండ్ నుండి, మరొకడు అమెరికా నుండి వచ్చేశారట. నాలుగు రోజులైంది. మళ్ళీ దినం రోజు దేనికైనా కుదురుతుందో లేదో. మనసు ఆగక వెంటనే బయలుదేరిపోయాను.
రోషన్తో నేను మాట్లాడితే, గులాబ్కు నన్ను నరికేయాలనిపిస్తుంది. గులాబ్తో మాట్లాడటం ఆయేషాకు నచ్చదు. ఆమెకు ఒక నగ తీసిస్తే, యీమె ఒక నగ పగలగొడుతుంది. ఈమెకు వొక పట్టు రవికె కొనిస్తే, ఆమె ఒక రవికెను చింపేస్తుంది. ఈ విధంగా అన్నిట్లో ఆ ముగ్గురూ పరస్పర విరుద్ధంగా ప్రవర్తిస్తూ నా ప్రాణం తీస్తున్నారు. ఒక సంవత్సరమా, రెండు సంవత్సరాలా, నా జీవితం మొత్తం వీళ్ళ వల్ల నరకమయిపోయింది.
ఉరి ఉచ్చు గట్టిగా బిగించే తాడు వెతకలేదు.
బలమైన కొమ్మలతో ఎత్తైన చెట్టు వెతకలేదు.
ఉన్నట్టుండి వేలాడపడే చావు బరువుని
తట్టుకోగలిగే చేపుగా పెరిగిన చెట్టును వెతికి పట్టుకోలేదు.
పొదుపు చేసుకున్న
పదాలను ఖర్చుచేసి,
పానశాలకు వెలుపల
కాసింత మైకాన్ని కొనుక్కున్నాను.
అదుపు చేసుకోలేని
అనుభూతిని దాచిపెట్టి
పాఠశాలకు అవతల
తగినంత కవనాన్ని కనుక్కున్నాను.
బయటనుంచీ శిల ఒక పొడుపుకథ
దానినెలా విప్పాలో ఎవరికీ తెలియదు. కానీ
లోలోపల అది స్తబ్దంగా నిశ్శబ్దంగా వుండే వుంటుంది
ఓ ఆవు తన భారాన్నంతా దానిపై నిలిపి పైకెక్కినా
ఏ చిన్నారైనా దాన్ని నదిలోకి విసిరేసినా
అది మెల్లగా నిరుద్రేకంగా
నది లోపలికి నిశ్శబ్దంగా మునిగిపోతుంది.
చీకట్లను ఈదుతూ అలసిపోతున్నపుడు
ఒక్కోసారి చందమామ అడ్డం పడి
వెన్నెలను పరిచయం చేస్తుంది
అదాటున బద్ధశత్రువు కనబడి
ప్రేమగా చేతులు చాపుతుంది
ఎన్నో సంక్లిష్టప్రశ్నలకు
ఎన్నాళ్ళుగానో వెతుకుతున్న జవాబులు
అది ఎంత పెద్దది
ఎంత చిన్నది
ఏ గదిలో ఇమడాలి
గుండ్రపుదా చదరపుదా
ఎన్ని కుర్చీలుండాలి ఎలా ఉండాలి
వాదోపవాదాలయాకే
ఇంటిలోకి ఏదో ఒకటి ప్రవేశించేది
దయితరో!
ఈ ఉదయం, నీ వదనం
నా హృదయంపై
విరియనీ!
అధరాలు భ్రమరాలై
మధువులలో మడియనీ
ప్రతిభ యనగా నేమి? అపూర్వవస్తు నిర్మాణ దక్షమైన ప్రజ్ఞయే ప్రతిభ యని అభినవగుప్తుని అభిప్రాయము. ఎప్పటికప్పుడు నవనవముగా వికసించు బుద్ధియే ప్రతిభ, దాని కాశ్రితుడై నిపుణమైన వర్ణనలు చేసేవాడే కవియని భామహుడను ఆలంకారికుడు ప్రతిభను నిర్వచించెను. ప్రతిభయే కవిని అకవి నుండి వేఱుచేసే లక్షణం.
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. […]
క్రితం సంచికలోని గడినుడి-59కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేడుగురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-59 సమాధానాలు.